Kothagudem: పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kothagudem: పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన!
Kothagudem: ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, గర్భిణీల రిజిస్టర్లు, టీకాల కార్యక్రమ అమలు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణీలకు EDD క్యాలెండర్ ప్రకారం ప్రసవ తేదీలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి గర్భిణికి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. గర్భిణీలు ఐరన్, కాల్షియం మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత నివారించవచ్చని వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలోనే సురక్షిత ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ కాన్పుల శాతాన్ని పెంచేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. తల్లి మరియు శిశు మరణాలను తగ్గించేందుకు హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం తీవ్రమైన ఎండలు ఉన్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, ORS ద్రావణాలు తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి చిన్నారికి సమయానికి టీకాలు అందించాలని ఆదేశించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి మైక్రో ప్రణాళికను సిద్ధం చేసి, ఐదేళ్ల లోపు పిల్లల లైన్ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు ఒక్క చిన్నారిని కూడా మిస్ కాకుండా ఇంటింటికి వెళ్లి 0.నుండి 5 సంవత్సరాల పిల్లల కోసం సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
అలాగే ప్రజలు పరిశుభ్రత పాటించడం, మరుగుదొడ్లు వినియోగించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేష్ MLHP, రాధిక HV, నర్సింగ్ ఆఫీసర్, సిబ్బంది, పాల్గొన్నారు.




