Kothagudem: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Nov 2026 9:33 AM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాదాల నివారణకు పోలీసులు ఆయా రహదారులపై రాకపోకలను నిలిపివేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని హెచ్చరించారు.

పశువుల కాపరులు పశువులను వాగులు, వంకలు, నదుల సమీప ప్రాంతాలకు తీసుకెళ్లకూడదని, పొంగిప్రవహిస్తున్న నీటి ప్రవాహాలను దాటించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాలు, చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద నీటిలో రహదారులు దాటేందుకు ప్రయత్నించడం, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.

ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM