Kothagudem: కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు: ఏఐటీయూసీ అల్టిమేటం!
Kothagudem: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
Kothagudem: కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు: ఏఐటీయూసీ అల్టిమేటం!
కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. కార్మికుల సహనాన్ని పరీక్షించవద్దని, పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. తొలుత యూనియన్ వ్యవస్థాపక నాయకుడు కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రెండు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి గతంలో మాదిరిగా 100 శాతం డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, మెడికల్ ఫిట్ అయినప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సుమారు 200 మందికి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని, యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయాలని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ముఖ్య సలహాదారు శేషయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి జి.వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణ మూర్తి, జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టఫర్, కత్తర్ల రాములు ఆఫీస్ బేరర్లు ఎస్ నాగేశ్వరరావు, పిట్ కార్యదర్శులు రమేష్, నరేష్, మధు కృష్ణ, కమల్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ఎర్రగాని కృష్ణయ్య , లక్ష్మీనారాయణ, ఎం ఆర్ కె ప్రసాద్, రామచంద్ర కుమారరావు, సాయి పవన్, శశివర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సందీప్ సంజీవ్, లెనిన్, ప్రవీణ్ ,మురళి, తిరుపతి వివిధ బ్రాంచ్‌ల ప్రతినిధులు, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు పాల్గొన్నారు.




