Kothagudem: సింగరేణి కార్మికుల సమస్యలపై ఐఎన్‌టీయూసీ చర్చలు!
Kothagudem: సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో ఐఎన్‌టీయూసీ చర్చలు జరిపింది. అక్టోబర్ 15లోపు లాభాల వాటా ప్రకటించాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేసినట్లు త్యాగరాజన్ తెలిపారు.
Kothagudem: సింగరేణి కార్మికుల సమస్యలపై ఐఎన్‌టీయూసీ చర్చలు!
కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రభుత్వంతో, సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపిందని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీ. త్యాగరాజన్ వెల్లడించారు.
ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవరెడ్డి నాయకత్వంలో, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సంఘం కమిటీ చైర్మన్ డాక్టర్ జనక్ ప్రసాద్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ అంశాలపై ఇరు వర్గాలు సానుకూలంగా స్పందించాయని సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ఈ నెల 15వ తేదీలోపు ప్రకటించి వారి ఖాతాల్లో జమ చేయాలని జనక్ ప్రసాద్ కోరినట్లు త్యాగరాజన్ తెలిపారు. ప్రతినెలా మెడికల్ బోర్డు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు సొంతింటి కలను సాకారం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
పెండింగ్ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించడం, ఆదాయపు పన్ను భారం నుంచి ఉపశమనం కల్పించడం, అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించడం వంటి అంశాలను చర్చల్లో ప్రస్తావించినట్లు వివరించారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు గనుల కేటాయింపులకు చర్యలు చేపట్టాలని, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని కోరినట్లు తెలిపారు.
బొగ్గు ఉత్పత్తితో పాటు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని, గనుల్లో డ్రిల్ బిట్స్, భద్రతా పరికరాలు, స్పేర్ పార్ట్స్‌ను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అధికారులకు సంబంధించిన పీఆర్పీని త్వరగా అమలు చేయాలని కూడా కోరినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి కేడం ఆల్బర్ట్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎస్. పీతాంబర్ రావుతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.




