Bhadradri Kothagudem: అక్రమ జంతు రవాణాపై ఎస్పీ రోహిత్ రాజు సీరియస్.. నిబంధనలు దాటితే జైలుకే!
Bhadradri Kothagudem: బక్రీద్ పండుగ దృష్ట్యా జిల్లాలో అక్రమ జంతు రవాణాపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
కొత్తగూడెం: రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా అక్రమంగా జంతువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టడానికి పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తనిఖీలను చేపట్టడం జరుగుతుందని వివరించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పశువుల సంతలు,బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల పనితీరు తదితర విషయాలపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందని అన్నారు.జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధంగా ఆవులు,దూడలను అక్రమంగా రవాణా చేసి,వధించడం పూర్తిగా నిషేధమని,అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుండి జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 02 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు,03అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి,మొత్తం 05 చెక్‌పోస్టుల వద్ద 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి చెక్‌పోస్టులో పోలీస్ సిబ్బందితో పాటు పశుసంవర్థక శాఖ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు కఠినంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
జంతువుల రవాణా సమయంలో సంబంధిత చట్టాలు,నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు.అలాగే అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని,వ్యక్తిగత దాడులు,గుంపులుగా దాడులు చేయడం కూడా శిక్షార్హమైన నేరాలని ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి పశువుల అక్రమ రవాణా,అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ముఖ్యంగా యువత ఆవేశానికి లోనవకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,మత పెద్దలు యువతకు శాంతి,సామరస్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్,ఫేస్‌బుక్ వంటి వాటిలో పశువుల అక్రమ రవాణాకు సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు,అసత్య ప్రచారాలు,ప్రేరేపిత పోస్టులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇందుకోసం జిల్లా పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా ఉంచిందని తెలిపారు.ప్రజల్లో భయాందోళనలు కలిగించే రూమర్లు వ్యాప్తి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని,డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ప్రతీ పండుగ సందర్బంగా ప్రజలు పరస్పరం మతాలను గౌరవించుకుంటూ,శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




