Kothagudem: సూపర్‌ ఎల్‌నినో ముప్పు: 2027 జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం!

Kothagudem: సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, 2027 జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యమివ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పిలుపునిచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 12 Oct 2026 9:31 PM IST
Kothagudem
X

Kothagudem: సూపర్‌ ఎల్‌నినో ముప్పు: 2027 జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం!

Kothagudem: సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 2026–27 యాసంగి సాగుపై సోమవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు రైతులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి సాగునీటి విడుదల లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, 2027 జూన్‌ వరకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పశువులకు నీరు, మేత అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్‌.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో రైతులకు పప్పుధాన్యాలు, పెసలు, కందులు, మిరప తదితర పంటల సాగుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈసారి కూడా రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా మార్గనిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు.

*తాగునీటి వనరులకు ముందస్తు మరమ్మతులు*

జిల్లాలో భూగర్భ జలమట్టం సుమారు రెండు మీటర్ల మేర తగ్గిన నేపథ్యంలో తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లోని పాత తాగునీటి పథకాలు, బోరుబావులు, ఇతర నీటి వనరులను ముందుగానే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఎంపీడీవోలు, ఎంపీవోలను ఆదేశించారు. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా 2027 జూన్‌ వరకు తాగునీటి అవసరాలను అంచనా వేసి, అందుబాటులో ఉన్న వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

*ప్రతి గ్రామంలో 20కి పైగా ఉపాధి పనులు*

వీబీ-జి రామ్‌ జి పథకం కింద ప్రతి గ్రామంలో కనీసం 20కి పైగా పనులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఫామ్‌ పాండ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టి వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుకూల పరిస్థితుల్లో చేపల పెంపకం వంటి అనుబంధ ఉపాధి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పశువులకు తాగునీరు, మేత కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

*ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం*

జిల్లాలో గత రబీ సీజన్‌తో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణాన్ని సుమారు 50 వేల ఎకరాల మేర తగ్గించినట్లు కలెక్టర్‌ తెలిపారు. తగ్గించిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో విస్తృతంగా సాగవుతున్న ఆయిల్‌పామ్‌ను ఇతర అనుకూల మండలాల్లోనూ ప్రోత్సహించాలని తెలిపారు. ములకలపల్లి, చండ్రుగొండ తదితర మండలాల్లో నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

తాగునీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఉపాధి హామీ పనులు, పశుసంరక్షణ అంశాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి లభ్యత, సాగు వ్యయాలు, పంటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన సాగు ప్రణాళిక రూపొందించుకునేలా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్‌, మార్కెటింగ్‌ అధికారి అలీమ్‌ ఖాన్‌, భూగర్భ జలవనరుల శాఖ అధికారి రమేష్‌, తహసీల్దార్‌ స్వాతి బిందు, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN