Yellandu: విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు!

Yellandu: విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యార్థులు పోరాడాలని ఇల్లందులో జరిగిన సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 3 Nov 2026 8:34 PM IST
Yellandu
X

Yellandu: విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు!

ఇల్లందు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో తీసుకు వస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలపై , ప్రభుత్వ విద్యారంగ బలోపేతం, సమానత్వ సమాజ స్థాపన ధ్యేయంగా భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేయాలని పి డి యస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. ఇల్లందు డివిజన్ ముఖ్యుల సమావేశం ఇల్లందు పట్టణం చండ కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా కాషాయీకరించేందుకు విద్యారంగంలో దుర్మార్గ పూరిత సంస్కరణలకు పూనుకుంటున్నారని అన్నారు. విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయంగా మార్చి పేద వర్గాలకు విద్య అందకుండా కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారని తెలిపారు.

దేశంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయక పోవటంతో నాణ్యమైన పరిశోధనలు జరుగక విశ్వవిద్యాలయాలన్ని సంక్షోభంలో కూరుకుపోతున్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం బడుల అభివృద్ధిని విస్మరించి గుడుల అభివృద్ధికి పూనూకుంటున్నదని తీవ్రంగా ఆక్షేపించారు.

రాష్ట్రం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వ వలసిన సుమారుగా పదివేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నత విద్య భవిష్యత్తును కాలరాస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక మౌలిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు సంక్షేమ హాస్టల్స్ లపై రాష్ట్ర ప్రభుత్వం,ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వలన అనేక సమస్యలు తిష్టవేసాయని అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, విద్య రంగానికి మంత్రిని కేటాయించాలని, విద్యాసంస్థల బలోపేతానికి కేద్ర బడ్జెట్ లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర విద్యార్థి లోకాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఈ ముఖ్యల సమావేశంలో పి డి యస్ యూ రాష్ట్ర నాయకులు చాందావత్ శ్రావణ్, పి డి యస్ యూ ఇల్లందు డివిజన్ నాయకులు గంగాధర గణేష్, పి డి యస్ యూ జిల్లా నాయకురాలు శ్రావణి, పి డి యస్ యూ నాయకులు ఆయుష్, లక్ష్మీ నరసింహ, పండు, హేమచంద్ర, నాగచైతన్య, అస్లాం, జస్వంత్, రోహిత్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU