Manuguru: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై ఎమ్మెల్యే పాయం దిగ్భ్రాంతి!
Manuguru: మణుగూరు ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళులర్పించారు. కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు, రూ.కోటి బీమాను ప్రభుత్వం ప్రకటించింది.
Manuguru: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై ఎమ్మెల్యే పాయం దిగ్భ్రాంతి!
మణుగూరు: మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవళిక భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్ ప్రవళిక మృతి అత్యంత బాధాకరమని, ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మహిళను కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి, ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వడం హర్షణీయమన్నారు.
ప్రవళిక కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు, ప్రభుత్వం మరియు ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పరిహారం కూడా కుటుంబానికి అందనుందని తెలిపారు.
కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయ సహకారాలు వారి భవిష్యత్తుకు కొంత భరోసా కల్పిస్తాయని, ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతకు నిదర్శనమని అన్నారు. అయితే కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధను ఎన్ని ఆర్థిక సహాయాలు అందించినా తీర్చలేమని విచారం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల భద్రత, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్య ఏవైనా సమస్యలు తలెత్తితే చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రవళిక కుటుంబానికి అండగా నిలుస్తామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబానికి అండగా నిలిచి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ఎక్స్‌గ్రేషియా, ప్రమాద బీమా వంటి సహాయాలను ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




