Kothagudem: బైక్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బుజ్జిబాబును అరెస్ట్ చేసి యూనికార్న్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Kothagudem: బైక్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 11: లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మోటార్‌సైకిల్ దొంగతనం కేసును టాస్క్‌ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో జయశంకర్ కాలనీకి చెందిన తాటి బుజ్జిబాబు (33)ను అరెస్ట్ చేసి, దొంగిలించిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు గతంలో కాపర్, బైక్ దొంగతనాల కేసులతో పాటు హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నప్పటికీ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఆగస్టు 3న లక్ష్మీదేవిపల్లిలోని బావర్చి సెంటర్ సమీపంలోని బిల్లా పాన్ షాప్ వద్ద నంబర్ ప్లేట్ లేని హోండా యూనికార్న్ బైక్‌ను గుర్తించాడు. బైక్ యజమానితో పరిచయం పెంచుకుని, అతనికి మద్యం తాగించిన అనంతరం తాళం తీసుకుని బైక్‌తో పరారైనట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
బైక్‌ను విక్రయించేందుకు అక్టోబర్ 10న బయటకు తీసుకెళ్తుండగా పోలీసుల వాహన తనిఖీలను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా, దొంగతనం విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన టాస్క్‌ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. వాహనాలు, ఇతర ఆస్తుల చోరీలు జరిగిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అనుమానాస్పద ఘటనలపై పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.




