Kalluru: కల్లూరుకు హైడ్రా రావాలి.. చెరువులు, కుంటలను కాపాడాలి!
Kalluru: కల్లూరు మండలం ఎర్రబంజర్‌లో ఎర్ర చెరువు ఆక్రమణకు గురైందని, చెరువులను కాపాడేందుకు కల్లూరుకు హైడ్రా రావాలని మాజీ సర్పంచ్ జమలయ్య డిమాండ్ చేశారు.
Kalluru: కల్లూరుకు హైడ్రా రావాలి.. చెరువులు, కుంటలను కాపాడాలి!
కల్లూరు: కల్లూరు మండలంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించి, వాటిని పరిరక్షించేందుకు హైడ్రా తరహా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎర్రబంజర్ మాజీ సర్పంచ్ జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని ఎర్రబంజర్ గ్రామంలో ఉన్న ఎర్ర చెరువు ఆక్రమణకు గురైందనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చెరువు అలుగుతో సహా చెరువు భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామానికి నీటి ఆధారంగా ఉన్న చెరువు నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై సంబంధిత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని రైతులు వాపోతున్నారు. చెరువుల ఆక్రమణల వల్ల భవిష్యత్తులో సాగునీటి సమస్యలు, భూగర్భ జలాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రబంజర్‌లోనే కాకుండా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని జమలయ్య కోరారు. ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం భూములు, అలుగులు, తూములు ఆక్రమణకు గురయ్యాయా అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి హైడ్రా తరహా ప్రత్యేక వ్యవస్థను కల్లూరు మండలంలో ఏర్పాటు చేసి, చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించి జలవనరులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి తరాలకు నీటి వనరులను అందించాలంటే నేటి నుంచే చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




