Kothagudem: బీఆర్ఎస్ గ్రూపు తగాదాలపై ఉక్కుపాదం.. ఖమ్మం నేతలకు హైకమాండ్ వార్నింగ్!
Kothagudem: కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై ముఖ్య నేతల సమావేశం.
Kothagudem: బీఆర్ఎస్ గ్రూపు తగాదాలపై ఉక్కుపాదం.. ఖమ్మం నేతలకు హైకమాండ్ వార్నింగ్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు, SIR పై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి, MLC, BRS పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఖమ్మం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, హరిప్రియ నాయక్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
ఈసందర్భంగా. బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్ రావు.. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.. గ్రూపు తగాదాలు వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకతను ఒడిసి పట్టాలి అంటూ కామెంట్స్ చేశారు.. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయాలని, గ్రూపు తగాదాలు వర్గ విభేదాలు పక్కన పెట్టి, పార్టీ పునర్నిర్మాణం అభివృద్ధికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈసందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, రైతులు నేడు రోడ్లమీద ఉంటున్నారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్రంలో విద్యా విధానం,విద్యార్థుల పరిస్థితి, ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 6 గ్యారంటీలు, అనేక హామీలను ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పి, రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హామీలను అమలు చేయలేక బేల తనాన్ని ప్రదర్శిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భూకబ్జాలు, రౌడీయిజం పెరిగిపోయింది, నడి రోడ్లమీద హత్యలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. బడే బాయ్ చోటే బాయ్ ఇక ఇకలు పకపకలు జింఖానా గ్రౌండ్స్ లో చూసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కేసీఆర్ ని ఎందుకు దూరం చేసుకున్నామా అని ప్రజలు ఆలోచన చేస్తున్నారని, కన్నీళ్లు పెడుతున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారని వివరించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు- మహానుభావులు ఉన్నారు అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్న ప్రజల అభిప్రాయాన్ని పార్టీ ఒడిసి పట్టుకోవాలి.. అందుకు అనుగుణంగా పనిచేయాలి.. పార్టీ సభ్యత్వం గతంలో లాగా మాన్యువలైజేషన్ ఉండదని, సెలెక్ట్ చేసిన ప్రతి బూత్ కమిటీల వ్యక్తులకు డిజిటలేషన్ చేయుటకు శిక్షణ ఇస్తామన్నారు. గత ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా సమిష్టి కృషితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 కి 10 గెలవాలి గులాబీ జెండా ఎగరాలి.. గ్రూపులను ఉక్కుపాదంతో కంట్రోల్ చేయాలన్న పార్టీ హైకమాండ్ ఆదేశాలను పాటిస్తానని తెలిపారు . మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ పోవాలి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న నినాదంతో పార్టీ పట్టిష్టతకు ముందుకు వెళ్తామన్నారు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు
బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనతో జత కట్టాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారని, వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కలిసి పయనిస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ బహిరంగ సభలో ప్రజలు భయంతో వణికిపోయెలా మాట్లాడారని,కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులు తిరిగి వస్తాయంటూ పరోక్షంగా హెచ్చరించారన్నారు.పార్లమెంటులో తాను ప్రశ్నించిన సందర్భంగా క్రూడాయిల్, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ నిల్వలు రెండేళ్లకు సరిపడా అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం బదులిచ్చిందని పేర్కొన్నారు.ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక ప్రధానమంత్రి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు.
బడేభాయ్-ఛోటా భాయ్ కలిసి పని చేస్తున్నారని, దేశంలో,రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని,ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతున్నాయని వద్దిరాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని,ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తాగేందుకు నీళ్లు,నిల్వనీడ లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చాతగాని ఈ మొద్దు దద్దమ్మ ప్రభుత్వం పోయి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు బలమైన నిర్ణయానికి వచ్చారన్నారు..
వచ్చే ఎన్నికల్లో10కి 10 ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయమన్నారు. మనమందరం మరింత సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగుతూ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకుందామని,ఓట్ల సవరణ జాబితా సందర్భంగా తగు జాగ్రత్తగా వ్యవహరిద్దామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పార్టీ నాయకులు మానే రామకృష్ణ,వనమా రాఘవ, దామోదర్, రాంప్రసాద్,బాదావత్ శాంతి నాయక్,సింధూతపస్వి, తదితరులు పాల్గొన్నారు.




