Bhadradri Kothagudem: కారుకొండ బౌద్ధ గుహలకు మహర్దశ!

Bhadradri Kothagudem: లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ ప్రాచీన బౌద్ధ గుహలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Sept 2026 10:31 AM IST
Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem: కారుకొండ బౌద్ధ గుహలకు మహర్దశ!

Bhadradri Kothagudem: జిల్లాలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ క్షేత్రాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని కారుకొండ రామవరం గుట్టపై ఉన్న ప్రాచీన బౌద్ధ గుహలు, ధ్యాన మందిరంతో పాటు సమీపంలోని కారుకొండ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను కారుకొండ బౌద్ధ గుహల వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కారుకొండ గుట్టపై ఉన్న బౌద్ధ క్షేత్రం శాతవాహనుల కాలానికి చెందినదిగా, క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటిదిగా పురావస్తు ఆధారాల ద్వారా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతంలోని గుహల్లో నివసిస్తూ ధ్యాన సాధన చేసేవారని అక్కడి నిర్మాణ శైలి, శిల్పకళా ఆనవాళ్లు సూచిస్తున్నాయి.

ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా పర్యాటక రంగ నోడల్ అధికారి అనూష గురువారం కారుకొండ బౌద్ధ గుహలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుహల నిర్మాణ శైలి, పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు క్షేత్రానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, విశేషాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, పర్యాటకులను ఆకట్టుకునేలా కారుకొండను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రహదారి, తాగునీరు, సమాచార కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా కారుకొండ చెరువును సుందరీకరించి పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

కారుకొండ బౌద్ధ గుహల అభివృద్ధి పూర్తయితే చారిత్రక వారసత్వ పరిరక్షణతో పాటు జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. కార్యక్రమంలో స్థానిక అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM