Palvancha: పాల్వంచలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం!
Palvancha: ఓటర్ల జాబితా అక్రమాలపై పాల్వంచలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం. సీఈసీ రాజీనామాకు డిమాండ్.
Palvancha: పాల్వంచలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం!
Palvancha: ఓటు హక్కు తొలగింపులు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అల్లూరి సెంటర్‌లో జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఈ. మధు మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమేనని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేశారు. ఫారం-7 దుర్వినియోగం ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని కోరారు.
బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్ల విషయంలో అర్హులైన ఓటర్లకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ఓటు హక్కును కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న నిరసనలపై దాడులు జరుగుతున్నాయని, నిరసనకారులతో పాటు పార్లమెంటు సభ్యులపై దాడులు జరగడం ఆందోళనకరమని నాయకులు విమర్శించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, సంబంధిత యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే. బ్రహ్మచారి, జిల్లా కార్యదర్శి ఏజే రమేష్, కోశాధికారి జీతం, జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, ఈసం వెంకటమ్మ, పిట్టల అర్జున్, కే. సత్య, గద్దల శ్రీను, బొల్లి వెంకటరాజు, భూక్య రమేష్, ఎం. రాజేష్, సుశీల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




