Chandrugonda: చంద్రుగొండ భూసేకరణ, ఓటరు సవరణపై కలెక్టర్ సమీక్ష

Chandrugonda: చంద్రుగొండలో కలెక్టర్ అంకిత్ పర్యటన. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. స్కూళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 14 July 2026 4:18 PM IST
Chandrugonda
X

Chandrugonda: చంద్రుగొండ భూసేకరణ, ఓటరు సవరణపై కలెక్టర్ సమీక్ష

చంద్రుగొండ: జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం చంద్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిప్పనపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులు, మద్దుకూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, అనంతరం చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, క్రీడలకు అవసరమైన ప్రోత్సాహం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ముందుగా తిప్పనపల్లి గ్రామంలో కొనసాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులను పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిప్పనపల్లి గ్రామ పరిధిలో మొత్తం 70 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రతిరోజూ సుమారు 15 ఎకరాల మేర సర్వే చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం మద్దుకూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 65 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వివరించగా, మిగిలిన ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా డిజిటలైజేషన్ చేపట్టాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న సాంబార్ పలుచగా ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, యూనిఫాంల పంపిణీపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యార్థి వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంపీడీవో అశోక్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story