Khammam: ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం: కలెక్టర్!

Khammam: ఖమ్మం వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. నవంబర్ నెలాఖరులోగా ఇండ్లు, మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 7 Oct 2026 6:54 PM IST
Khammam
X

Khammam: ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం: కలెక్టర్!

ఖమ్మం, అక్టోబర్ - 07: పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

బుధవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను తనిఖీ చేసి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. గోడల నిర్మాణం, స్లాబ్ పనులు, పైకప్పు పనులు, తుదిదశ నిర్మాణ పనుల పురోగతిని ఒక్కొక్క ఇంటి వారీగా పరిశీలించారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ, నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణాలతో పాటు అంతర్గత రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారులకు నిర్మాణ సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, నిర్మాణం పూర్తయిన దశల ఆధారంగా ప్రతి సోమవారం బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇల్లు పూర్తయిన అనంతరం మొత్తం రూ.5 లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు.

ఇప్పటికే అర్హత పొందిన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైన నిర్మాణ సామగ్రి, సాంకేతిక సహాయం, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి జాప్యం లేకుండా రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి, లబ్ధిదారులు తమ సొంతింటిలో గృహప్రవేశం చేసేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యతతో కూడిన శాశ్వత గృహాలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్, ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.