Sathupally: భూ భారతి చట్టం అమలుకు భూ రీ-సర్వే అత్యంత ప్రాధాన్యత కలెక్టర్
Sathupally: సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో భూ రీ-సర్వేపై సర్వేయర్లు, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అవగాహన సమావేశం నిర్వహించారు.
Sathupally: భూ భారతి చట్టం అమలుకు భూ రీ-సర్వే అత్యంత ప్రాధాన్యత కలెక్టర్
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.బుధవారం సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి మండల సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందికి భూ రీ-సర్వేపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, భూ రీ-సర్వే ఉద్దేశం భూమిని విభజించడం కాదని, ఆ భూమిపై ప్రస్తుతం ఎవరు సాగు చేస్తున్నారు, వారి పేరుపై ఎంత భూమి నమోదై ఉంది, వారికి పట్టాదారు పాస్‌బుక్ ఉందా లేదా అనే అంశాలను మాత్రమే నిర్ధారించడమే రీ-సర్వే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదైన విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం సరిపోతున్నాయా లేదా అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, అసాధారణంగా ఎక్కువ లేదా తక్కువ విస్తీర్ణం నమోదైతే, దాని కారణాలను పూర్తిగా పరిశీలించి ధృవీకరించాలని సూచించారు.
ప్రతి భూ రీ-సర్వే సమయంలో సంబంధిత రైతు వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలు వంటి అన్ని పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని అన్నారు. సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా తయారు చేయడం, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ నమోదు చేయడం వంటి ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు.
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో ఇప్పటికే భూ రీ-సర్వే విజయవంతంగా నిర్వహించామని, ఆధునిక సర్వే పరికరాలతో గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అక్కడ ప్రజలు రీ-సర్వేపై సంతృప్తి వ్యక్తం చేశారని, కుటుంబ వివాదాలు మినహా పెద్దగా అభ్యంతరాలు రాలేదని కలెక్టర్ గుర్తు చేశారు.
ఈ సమావేశంలో ఎడీ సర్వేయర్ రాజేందర్, సత్తుపల్లి మండల తహసీల్దార్ సత్యనారాయణ, సర్వేయర్లు, గ్రామ పాలనాధికారులు, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




