Kothagudem: రామన్నగూడెంలో భూ రీ సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో భూ రీ సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
Kothagudem: రామన్నగూడెంలో భూ రీ సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో భూ రీ సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాలని, అశ్వారావుపేటలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో భూ రీ సర్వే పనులను, అశ్వారావుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పనుల పురోగతిని సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్, సర్వే నంబర్లు, గ్రామ సరిహద్దులు, రెవెన్యూ భూములు, అటవీ భూములకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో భూ రీ సర్వే పనులు కొనసాగుతున్నాయని, సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో గ్రామ సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియ చేపడుతున్నామని సర్వేయర్లు వివరించారు. గత వారం గ్రామసభ నిర్వహించి గ్రామ సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
సర్వే నంబర్ 39 పరిధిలో భూములను సాగు చేసుకుంటున్న రైతులతో కలెక్టర్ మాట్లాడి, వారు ఎప్పటి నుంచి భూములను సాగు చేస్తున్నారు, వారి వద్ద పాత పట్టాలు, పాస్బుక్లు ఉన్నాయా, వాటిని ఎప్పుడు జారీ చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద ఉన్న పాత పట్టాలు, పాస్బుక్లు, ఇతర భూ సంబంధిత పత్రాలను పరిశీలించి రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి వాస్తవాలను నిర్ధారించాలని సూచించారు. మూడు సర్వే నంబర్ల పరిధిలో 181 మంది రైతులు ఉన్నట్లు అధికారులు వివరించగా, వారికి సంబంధించిన పట్టాలు, రైతుబంధు వివరాలు, భూముల సాగు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భూముల విస్తీర్ణం, గ్రామ సరిహద్దులు, అటవీ బ్లాక్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, పట్టాలు, గెజిట్ నోటిఫికేషన్లు, అందుబాటులో ఉన్న పాత భూ రికార్డులను సేకరించి ప్రస్తుత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. రికార్డుల్లో నమోదైన వివరాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసాలను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. భూ రీ సర్వేను పది రోజుల్లో పూర్తి చేసి, భూముల హద్దులు, విస్తీర్ణం, హక్కులకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
అనంతరం అశ్వారావుపేటలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ ప్రణాళిక, పనుల పురోగతి, విద్యార్థులకు కల్పించనున్న వసతులు, నిర్మాణ పనులు పూర్తి చేసే గడువుపై ఇంజినీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్మాణాన్ని వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలో శాఖాహారం, మాంసాహారం వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థుల కోసం డైనింగ్ హాల్, సుమారు 1,000 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ క్రీడలకు ప్రత్యేక గదులు, బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అనుగుణంగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
జూనియర్ విద్యార్థుల హాస్టల్ను జీ+2 అంతస్తుల్లో నిర్మిస్తున్నామని, ఇందులో డార్మిటరీలతో పాటు రెండు అంచెల పడకల సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులను గరిష్ఠంగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, డిసెంబర్ నెలాఖరులోగా స్లాబ్ పనులు పూర్తిచేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం సుమారు 100 మంది కార్మికులు నాలుగు బృందాలుగా పనులు నిర్వహిస్తున్నారని, పనుల పర్యవేక్షణకు నలుగురు సైట్ ఇంజినీర్లు, నలుగురు సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల నిర్మాణంలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ డి.కిషోర్ తో పాటు సంబంధిత రెవెన్యూ, సర్వే, అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.




