Kothagudem: కాంగ్రెస్ నాయకులది ద్వంద్వ వైఖరి: ఎంపీ వద్దిరాజు ఫైర్!

Kothagudem: కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, డీలిమిటేషన్‌పై విమర్శలు గుప్పించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Nov 2026 9:31 PM IST
Kothagudem
X

Kothagudem: కాంగ్రెస్ నాయకులది ద్వంద్వ వైఖరి: ఎంపీ వద్దిరాజు ఫైర్!

కొత్తగూడెం: కాంగ్రెస్ నాయకులు ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ అంశాన్ని పొందుపరిచి, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

దీక్షా దివస్ సందర్భంగా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి సుదీర్ఘ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను సహించలేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమేనని వివరించారు.

రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేయడంతో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారని గుర్తుచేశారు. 2009 నవంబర్ 29న 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు, అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఉద్యమం ఉధృతం కావడంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిందన్నారు. రాష్ట్ర సాధన కోసం అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్యారంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఎంపీ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభించిందని చెప్పారు. ధాన్యం దిగుబడి 36 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. కొత్త జిల్లాలు, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాల ఏర్పాటు ద్వారా విద్య, వైద్య రంగాలను విస్తరించారని అన్నారు.

డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంపునకు కూడా అవకాశం ఉంటుందని రవిచంద్ర పేర్కొన్నారు. మహిళలు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను సమర్థించిన కాంగ్రెస్ ఇప్పుడు భిన్నమైన వైఖరి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ బీఆర్ఎస్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంపీ ఆరోపించారు. బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోందని, బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

*ఉద్యమకారులకు సన్మానం*

దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM