Khammam: కాంగ్రెస్ అడ్డగోలు దోపిడీ చేస్తోంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి
Khammam: బుగ్గపాడు ఫుడ్ పార్క్లో భారీ కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
Khammam: కాంగ్రెస్ అడ్డగోలు దోపిడీ చేస్తోంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి
ఖమ్మం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గనులు, భూములు, ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటూ ప్రజా కంటక పాలన సాగిస్తోందని బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు సహ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టుల పేరుతో, 22ఏ భూముల పేరుతో రాష్ట్రాన్ని అక్షరాలా నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, బినామీల పేర్లతో అధికార పక్షం పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపించారు.
కేవలం రూ. 22 కోట్ల టర్నోవర్ ఉన్న దీపక్ నెటిజెన్ అనే కంపెనీకి అవుట్ రైట్ సేల్ కింద ఏకంగా 72 ఎకరాల విలువైన భూమిని ఎకరానికి కేవలం రూ. 25 లక్షల చొప్పున కారు చౌకగా కట్టబెట్టడం దేశంలో ఎక్కడా జరగని వింత అని ఆయన విమర్శించారు.
దీని వెనుక ఉన్న బినామీలు ఎవరో తక్షణమే బహిర్గతం చేయాలని, ఈ సమస్యను తాము ఎంతమాత్రం విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్న బారీ అవినీతిపై తన వద్ద ఐదు గంటల పాటు మాట్లాడేంత పక్కా సమాచారం ఉందని, త్వరలోనే అన్ని బండారాలు బయటపెడతామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను గాలికొదిలేసి పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి ఉచిత సలహాలు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఖమ్మం జిల్లాకు ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నేడు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాలను అటకెక్కించిందని నిలదీశారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లు కూడా అర్హులకు కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టే దుస్థితికి దిగజారారని విమర్శించారు. దమ్ముంటే ఇప్పటివరకు ఎవరికి ఇళ్లు కేటాయించారో బహిరంగ పరచాలని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని, తుక్డే గ్యాంగులతో, దేశ వ్యతిరేకులు, ఉగ్రవాదులతో కలిసి 'ఇండి కూటమి' పేరుతో దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతోందని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిద్రాహారాలు మాని రోజుకు 18 గంటల పాటు దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుంటే, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ నేతలు అసభ్యకరమైన పదజాలంతో ఆయనపై నిరాధార ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఈ నకిలీ గాంధీలకు ఏమాత్రం అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల సంఘాన్ని పొగిడే విపక్షాలు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అలాగే కమ్యూనిస్టులు కేరళలో కాంగ్రెస్ తో కొట్లాడుతూ, ఇక్కడ మాత్రం సిద్ధాంతాలను గాలికి వదిలేసి కమర్షియల్ పార్టీలుగా మారి పొత్తులు పెట్టుకోవడం శోచనీయమన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి తీసుకువచ్చారని, 140 కోట్ల మంది ప్రజలకు 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' నినాదంతో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో నడుస్తున్న ఈ అవినీతి, అరాచక పాలనను అంతమొందించేందుకు యువత, నిరుద్యోగులు సన్నద్ధం అవుతున్నారని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యవంతులైన విద్యావంతులంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
త్వరలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని, రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతారని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రబారి సన్నీ ఉదయ ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేష్, రుద్ర ప్రదీప్, పాలేరు బిజెపి అభ్యర్థి నున్న రవికుమార్ ,జిల్లా ఉపాధ్యక్షులు వీరల్లి రాజేష్ ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య ,జిల్లా మోర్చా అధ్యక్షులు మంద సరస్వతి, రీగన్, ఐటి కన్వీనర్ బోయినపల్లి సురేష్ ,మీడియా కన్వీనర్ కృష్ణ, కుమిలి శ్రీనివాస్ రుద్ర గాని మాధవ్ శ్రీ లక్ష్మీ రెడ్డి , గడిల నరేష్ , వంశీ వెంకటనారాయణ, మహేందర్ సింగ్ కోటి హనుమంతరావు పాల్గొన్నారు.




