Kothagudem: భద్రాద్రిని కరువు జిల్లాగా ప్రకటించాలి.. సీపీఐ భారీ ధర్నా!
Kothagudem: భద్రాద్రి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని భారీ ధర్నా చేపట్టారు.
Kothagudem: భద్రాద్రిని కరువు జిల్లాగా ప్రకటించాలి.. సీపీఐ భారీ ధర్నా!
Kothagudem: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఎల్నినో ప్రభావంతో పాటు అర్నాబ్, మురసు తుఫాన్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రైతులకు న్యాయం చేయాలని నినదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కరువు సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపించి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నిధులు కోరడం కూడా సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.
పంటలు సాగు చేయలేకపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో గోదావరి నది జలాలను వినియోగించుకునేలా నిలిచిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కరువు పరిస్థితులపై జిల్లా, నియోజకవర్గాల వారీగా అన్ని రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. కరువు సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సైతం నిర్దిష్టమైన సూచనలు చేయాలని కూనంనేని కోరారు.




