Kothagudem: ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం: సీపీఐ ర్యాలీ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ చేపట్టిన 'ప్రజా చైతన్య యాత్ర' కొత్తగూడెం పట్టణానికి చేరుకుంది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 10 Aug 2026 11:32 PM IST
Kothagudem
X

Kothagudem: ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం: సీపీఐ ర్యాలీ!

కొత్తగూడెం: సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు.

ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు.

కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story