Kothagudem: కేంద్ర పాలకులారా జాగ్రత్త: సెప్టెంబర్ 1న సీపీఐ 'ఛలో ఢిల్లీ'

Kothagudem: బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై 'బద్లావ్ జరూరి హై' నినాదంతో సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ' నిర్వహిస్తున్నట్లు సీపీఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వెల్లడించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Aug 2026 11:01 PM IST
Kothagudem
X

Kothagudem: కేంద్ర పాలకులారా జాగ్రత్త: సెప్టెంబర్ 1న సీపీఐ 'ఛలో ఢిల్లీ'

కొత్తగూడెం: కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 12 ఏళ్ల మోడీ పాలనకు వ్యతిరేకంగా 'బద్లావ్ జరూరి హై' ..."మార్పు కావాలి" అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తేదీన లక్షలాది మందితో రామ్ లీలా మైదాన్ 'ఛలో ఢిల్లీ' మహా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

వికసిత్ భారత్ పేరే తప్ప.. మార్పు లేదు, కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్' అభివృద్ధి చెందిన భారత్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయి గణాంకాల్లో ఎలాంటి మార్పు లేదని సాబీర్ పాషా ఎద్దేవా చేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలపై నియంత్రణ కరువైందని మండిపడ్డారు.

విద్యా విధానం పేద సామాన్య వర్గాల ప్రజలను విద్యకు దూరం చేసేలా ఉందన్నారు. రెండు కోట్ల కొత్త ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్య ఉపాధి హక్కులను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా చేర్చాలని కోరారు. మతోన్మాద శక్తుల నుంచి దేశా ఐక్యతను రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

44 కార్మిక చట్టాలను కాలరాసి కార్పొరేట్ శక్తులు ఆదానీ అంబానీలకు కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీట్ పేపర్ లీకేజ్ దారుణం... విద్యార్థుల ఆత్మహత్యలు, దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని నీట్ పేపర్ లీకేజ్ ఆందోళన కారణంగా 18 మంది అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దారుణం అన్నారు. జన్ జీ ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిందని,కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారన్నారు.

కేవలం మతోన్మాద రాజకీయాలతో దేశంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని కేంద్ర పాలకులను హెచ్చరించారు. జిల్లాలోని దీర్ఘకాలిక ప్రధాన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈనెల ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రల వివరాలను వెల్లడించారు. ఏడుల బయ్యారం నుంచి అశ్వరావుపేట వరకు అన్ని మండలాలను గ్రామాలను కలుపుతూ యాత్రలు చేపడుతున్నామని,

ఆగస్టు 6న పినపాక నియోజకవర్గం ఏడూళ్ల బయ్యారం నుండి ప్రజా చైతన్య యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు కొత్తగూడెం ఇల్లెందు పినపాక అశ్వరావుపేట భద్రాచలం పరిధిలోని ప్రతి రైతాంగానికి అందించి సాగునీటి కొరతని తీర్చాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో భూమి ,నీరు, బొగ్గు వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, కేటీపీఎస్ నూతన ప్లాంట్ నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు గోదావరి కరకట్ట నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విభజన చట్టం ద్వారా భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని, ఐదు గ్రామపంచాయతీలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలన్నారు.

జిల్లాలో మిగిలిన 73 వేల ఎకరాల పొడవులకు వెంటనే పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, కొమారి హనుమంతరావు, గనగళ్ల వీరస్వామి, ఎస్ కే పహీమ్, ఉప్పు శెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story