Kothagudem: సైబర్ నేరాలపై అవగాహన కోసం ఘనంగా ఫ్లాష్ వాక్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పోలీసులు ఫ్లాష్ వాక్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజు ప్రజలను అప్రమత్తం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Nov 2026 8:34 AM IST
Kothagudem
X

Kothagudem: సైబర్ నేరాలపై అవగాహన కోసం ఘనంగా ఫ్లాష్ వాక్!

Kothagudem: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్లాష్ వాక్ కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విద్యార్థులు, యువతకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు, స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు.

తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే బెదిరింపులు, నకిలీ ఉద్యోగ ఆఫర్లు, లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని, సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ “ఆగండి – ఆలోచించండి – ధృవీకరించుకోండి” అనే సైబర్ భద్రతా సూత్రాన్ని పాటించాలని ఎస్పీ సూచించారు. ఏదైనా అనుమానాస్పద సందేశం లేదా లింక్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఆగి, దాని నిజానిజాలను ఆలోచించి, సంబంధిత వ్యక్తి లేదా సంస్థ వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు.

సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

సురక్షితమైన డిజిటల్ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐలు నరేష్, జితేందర్, వెంకటేశ్వర్లు, యాసీన్, ఇంద్రసేనారెడ్డి, పోలీస్ అధికారులు, సైబర్ వారియర్స్, సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM