Khammam: చిరుమర్రి చెరువు వద్ద పర్యాటక అభివృద్ధికి శంకుస్థాపన!
Khammam: ఖమ్మం జిల్లా చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతులు, ముదిగొండలో రూ. 40 లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Khammam: చిరుమర్రి చెరువు వద్ద పర్యాటక అభివృద్ధికి శంకుస్థాపన!
Khammam: చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లాలోని చిరుమర్రి చెరువును ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చెరువును సుందరీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం వైఏటీ & సి శాఖ ద్వారా రూ. 2.90 కోట్ల పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్ణీత ఆరు నెలల గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రెండు ఫుడ్ కియోస్క్‌లు (ఆహార శాలలు), విశ్రాంతి కోసం సుందరమైన గెజిబోలు, ఆధునిక టాయిలెట్ బ్లాక్, మెరుగైన విద్యుద్దీకరణ, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్, హార్డ్‌స్కేప్ తోటలు, నడక దారులు మరియు విశాలమైన పార్కింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ఈ పర్యాటక కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
ముదిగొండలో రూ. 40 లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముదిగొండ మండల కేంద్రంలో గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 40 లక్షల వ్యయంతో చేపడుతున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన సమాచారాన్ని అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ గ్రంథాలయ భవన నిర్మాణం వేగవంతంగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా మండలంలోని వనం వారి కృష్టపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణతో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.




