Telangana: పారిశ్రామిక వృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా మారాలి

Telangana: జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ (DIPC) సమావేశంలో కలెక్టర్ అంకిత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 5 Jun 2026 8:45 PM IST
Telangana
X

Telangana: పారిశ్రామిక వృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా మారాలి

Telangana: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించి కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం వైటీసీ, పాలిటెక్నిక్ మరియు ఇతర సాంకేతిక విద్యా కోర్సులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నూతన కోర్సుల వివరాలతో కూడిన కరపత్రాలను అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.

సమావేశంలో భాగంగా టీజీఐపాస్ (TG-iPASS) ద్వారా పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 50 దరఖాస్తులు అందగా, వాటిలో 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఒక దరఖాస్తు తిరస్కరించగా, మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సేవా రంగ సంస్థలకు పెట్టుబడి రాయితీ పథకం అమలు, దరఖాస్తుల స్థితిగతులపై కూడా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) స్థాపనకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్లస్టర్ అభివృద్ధి, స్థానిక వనరుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ మేళాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమల సంఖ్యను పెంచి జిల్లాను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.

సమావేశంలో డేవిడ్ రాజు ఏపీఓ జనరల్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎల్ డి ఎం రామిరెడ్డి, మెప్మా పీడీ రాజేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంగామ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story