Khammam: టెన్త్‌లో 99% ఉత్తీర్ణతే లక్ష్యం: ఖమ్మం కలెక్టర్ దివాకర టిఎస్!
Khammam: ఖమ్మం జిల్లాలో పదో తరగతిలో 99 శాతం ఫలితాలు సాధించాలని, ఎఫ్‌ఎల్‌ఎన్‌లో వాస్తవ పురోగతి ఉండాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు.
Khammam: టెన్త్‌లో 99% ఉత్తీర్ణతే లక్ష్యం: ఖమ్మం కలెక్టర్ దివాకర టిఎస్!
ఖమ్మం, అక్టోబర్ 5: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌లో ప్రతి నెలా వాస్తవ పురోగతి సాధించాలని, తప్పుడు రిపోర్టులు, పెంచి చూపించే గణాంకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేక ఎఫ్‌ఎల్‌ఎన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి, విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
మండల, క్లస్టర్ స్థాయిలో సమీక్షలను నాణ్యతతో నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో నిపుణుల బృందాలు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో విద్యార్థుల సామర్థ్యాలు కనీసం 80 శాతం చేరేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా కార్యక్రమాల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, పాఠశాలల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన నిధులను సక్రమంగా, పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ సూచించారు. నిధుల వినియోగం, వాటితో సృష్టించిన ఆస్తులు, విద్యార్థుల నమోదు పెరుగుదలపై తదుపరి సమీక్షకు పీపీపీ రూపంలో వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా ఖమ్మం అర్బన్, తల్లాడ, పెనుబల్లి, ముదిగొండ మండలాల్లో హాజరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
పదో తరగతిలో 99 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీపావళి అనంతరం ప్రత్యేక తరగతులు ప్రారంభించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని సూచించారు. గత ఏడాది ఫలితాలను విశ్లేషించి తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలలను గుర్తించి, కారణాలను సరిదిద్దాలని ఆదేశించారు.
విద్యాశాఖలో అన్ని స్థాయిల్లో సమీక్షలు నిర్వహించేందుకు కామన్ రివ్యూ ఫార్మాట్ రూపొందించాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యా కార్యక్రమాల అమలు, మౌలిక వసతులు, అభ్యసన పురోగతి తదితర అంశాలను నిరంతరం సమీక్షించేలా వ్యవస్థను రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయుల ఉత్తమ బోధనా పద్ధతులను ఇతర పాఠశాలల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి డి. వాసంతి, మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.




