Pinapaka: గోదావరి ఇసుక తవ్వకాలపై అనుమానాలు.. విచారణకు డిమాండ్!

Pinapaka: పినపాక మండలం జానంపేట (సర్జిత్పల్లి) గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు, టిప్పర్ల ఓవర్‌లోడింగ్‌పై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 17 Nov 2026 4:19 PM IST
Pinapaka
X

Pinapaka: గోదావరి ఇసుక తవ్వకాలపై అనుమానాలు.. విచారణకు డిమాండ్!

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణా, స్టాక్ యార్డు నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు, గోదావరి ఒడ్డున పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉన్నట్లు క్షేత్రస్థాయిలో వెల్లడిస్తున్నాయి. నది నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్న క్రమంలో ఓవర్‌లోడింగ్ తో స్టాక్ యార్డ్ కు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

నవంబర్ 17న ఉదయం సుమారు 11:14 నుంచి 11:20 గంటల మధ్య GPS ఆధారిత కెమెరాతో తీసిన ఫొటోల్లో గోదావరి నది ప్రాంతంలో ఎక్స్‌కవేటర్లు, భారీ ఇసుక కుప్పలు, వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్న మట్టి మార్గం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నది ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఒడ్డున ఉన్న స్టాక్ యార్డు వద్ద కూడా పెద్ద మొత్తంలో ఇసుక నిల్వలు, డంప్ టిప్పర్ కనిపించాయి.

అనుమతులు ఒకచోట...క్షేత్రస్థాయి పరిస్థితులు మరోచోట..?

సర్జితపల్లి ఇసుక ర్యాంపుకు సంబంధించి గతంలో వెలువడిన ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TSMDC) ఆధ్వర్యంలో గోదావరి నదిలో 22.85 హెక్టార్ల విస్తీర్ణంలో ఇసుక తవ్వకాల కోసం 16-04-2021న పర్యావరణ అనుమతి (EC) జారీ అయినట్లు తెలుస్తోంది.అప్పటి పర్యావరణ అనుమతి దరఖాస్తులో మాన్యువల్ పద్ధతిలో ఇసుక తవ్వకాల ప్రతిపాదన, సంవత్సరానికి 2,28,500 క్యూబిక్ మీటర్ల పరిమాణం ప్రస్తావించబడింది.అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎక్స్‌కవేటర్లు కనిపిస్తుండటంతో, యంత్రాల వినియోగానికి ఆమోదిత మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతుల్లో అవకాశం ఉందా? లేక అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా..?

2022లోనే పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలు

సర్జితపల్లి ఇసుక ర్యాంపుకు సంబంధించి 2022లో TSMDC పర్యావరణ అనుమతి పొడిగింపు కోరిన సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలు ప్రభుత్వ సమావేశ రికార్డుల్లో నమోదయ్యాయి.14-06-2022న జరిగిన SEIAA సమావేశంలో ఆమోదిత మైనింగ్ ప్లాన్, గత పర్యావరణ అనుమతి షరతుల అమలు నివేదిక, ఇప్పటివరకు తవ్విన ఇసుక పరిమాణం, మిగిలిన ఇసుక నిల్వల వివరాలను సమర్పించాలని TSMDCని ఆదేశించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.అదే సమయంలో సర్జితపల్లి మహిళా గిరిజన కార్మిక సహకార సంఘానికి 10-08-2022న జారీ చేసిన TSMDC ఒప్పంద పొడిగింపు ఉత్తర్వు ప్రకారం, 28-06-2022 నుంచి 27-12-2022 వరకు ఆరు నెలలపాటు, 1,14,519.60 క్యూబిక్ మీటర్ల మిగులు ఇసుక పరిమాణానికి ఒప్పందం పొడిగించారు.అయితే 2022 డిసెంబర్ తర్వాత ఒప్పందం మరింత పొడిగించారా? కొత్త Raising Contractorను నియమించారా? ప్రస్తుతం తవ్వకాలు నిర్వహించేందుకు ఎవరికి అధికారిక అనుమతులు ఉన్నాయి?

నది నుంచి స్టాక్ యార్డుకు ఇసుక తరలింపు ఎలా జరుగుతోంది..?

క్షేత్రస్థాయి ఫొటోల్లో నది ప్రాంతం నుంచి ఒడ్డున ఉన్న ఇసుక నిల్వల ప్రాంతానికి వాహనాలు వెళ్లేందుకు మట్టి మార్గం ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. భారీ వాహనాల రాకపోకలకు అనువుగా ఉన్న ఈ మార్గానికి సంబంధించి అధికారిక అనుమతులు ఉన్నాయా? ఇది ఆమోదిత రవాణా మార్గమేనా? అనే అంశాలపై పరిశీలన అవసరం.నది నుంచి తీసిన ఇసుకను నేరుగా స్టాక్ యార్డుకు తరలిస్తున్నారా? రవాణా సమయంలో ప్రతి వాహనానికి TSMDC Way Bill జారీ చేస్తున్నారా? స్టాక్ యార్డులోకి వచ్చిన ఇసుక పరిమాణం, అక్కడి నుంచి విక్రయించిన ఇసుక పరిమాణం మధ్య లెక్కలు సరిపోతున్నాయా?

టిప్పర్ల ఓవర్‌లోడింగ్‌పై చర్యలు తీసుకునేదెవరు..?

స్టాక్ యార్డు వద్ద టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. వాహనాల సామర్థ్యానికి మించి ఇసుక లోడింగ్ జరుగుతోందనే అనుమానాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది.ప్రతి టిప్పర్‌కు అనుమతించబడిన బరువు ఎంత? వాస్తవంగా ఎంత బరువుతో రవాణా చేస్తున్నారు? వెయిట్‌బ్రిడ్జి రికార్డులు, వాహనాల RC వివరాలు, TSMDC Way Bills సరిపోతున్నాయా?

ఓవర్‌లోడింగ్ నిర్ధారణ అయితే సంబంధిత వాహనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

అధికారుల సంయుక్త తనిఖీలు అవసరం

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ, TSMDC, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది.

ప్రధానంగా కింది అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది:

1. ప్రస్తుతం ఇసుక తవ్వకాలకు చెల్లుబాటులో ఉన్న EC, CFO అనుమతులు ఉన్నాయా?

2. నదిలో ఎక్స్‌కవేటర్ల వినియోగానికి అనుమతి ఉందా?

3. తవ్వకాలు ఆమోదిత సర్వే సరిహద్దుల్లోనే జరుగుతున్నాయా?

4. అనుమతించిన లోతు, పరిమాణం మేరకే ఇసుక తవ్వుతున్నారా?

5. నదిలోకి మట్టి లేదా గ్రావెల్ రవాణా మార్గం నిర్మించేందుకు అనుమతులు ఉన్నాయా?

6. స్టాక్ యార్డుకు అధికారిక అనుమతి ఉందా?

7. ఇసుక రవాణా చేసే టిప్పర్లకు Way Bills, GPS రికార్డులు ఉన్నాయా?

8. ఓవర్‌లోడింగ్ జరుగుతోందా? జరిగితే ఇప్పటివరకు ఎన్ని వాహనాలపై చర్యలు తీసుకున్నారు?

9. ఇప్పటివరకు ఎంత ఇసుక తవ్వారు? ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరింది?

10. ప్రస్తుతం ర్యాంపును నిర్వహిస్తున్న సంస్థ లేదా కాంట్రాక్టర్ ఎవరు?

ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలి..

గోదావరి నది సహజ వనరులను పరిరక్షించడంతోపాటు, ఇసుక తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పూర్తిస్థాయిలో సమకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అనుమతులు, తవ్వకాల పరిమితులు, రవాణా పత్రాలు, స్టాక్ యార్డు నిల్వలు, ప్రభుత్వానికి చెల్లించిన రుసుములన్నింటినీ పారదర్శకంగా పరిశీలించాలి.

జానంపేట గోదావరి ప్రాంతంలో కనిపిస్తున్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సంబంధిత శాఖలు తక్షణమే విచారణ చేపట్టి, సర్జితపల్లి ఇసుక ర్యాంపుకు సంబంధించిన ప్రస్తుత అనుమతులు, తవ్వకాల పరిమితులు, రవాణా విధానం, ఓవర్‌లోడింగ్ ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA