Errakunta: ఎర్రకుంట చెరువులో రైతుల వినూత్న నిరసన
Errakunta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎర్రకుంట చెరువు కబ్జాపై రైతులు చెరువులోనే విలేకరుల సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు.
Errakunta: ఎర్రకుంట చెరువులో రైతుల వినూత్న నిరసన
Errakunta: అధికారుల అండదండలతో, నకిలీ పత్రాలు సృష్టించి ఎర్రకుంట చెరువును అక్రమంగా కబ్జా చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎర్రకుంట గ్రామ రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ నేత చండ్ర వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఈ చెరువును ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ గత రెండు రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఎర్రకుంట చెరువు లోపలే వినూత్నంగా విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ.. 1975 నాటి నుంచి ఉన్న ఈ చెరువు వందలాది మంది రైతులకు, పశువులకు జీవనాధారంగా నిలిచిందని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా ఈ చెరువు కింద పండించే పంటలకు తాము ప్రభుత్వానికి శిస్తు (పన్ను) కూడా చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ, కొందరు స్వార్థపరులైన నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అక్కడ చెరువే లేదని రెవెన్యూ అధికారులు చెప్పడంపై రైతులు తీవ్ర విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీపీఎం మద్దతు తో ఎర్రకుంట చెరువు ఆక్రమణలపై గ్రామ రైతులు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, ఇతర ముఖ్య నాయకులు హాజరై రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "వందలాది మంది రైతులకు జీవనాధారమైన చెరువును ఒకే ఒక్క వ్యక్తి స్వార్థం కోసం వదిలేయడం దుర్మార్గం. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తప్పుడు కాగితాలతో చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. చెరువుకు ఆక్రమణల నుండి విముక్తి కల్పించాలి. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం."అన్నారు.
ఈ విలేకరుల సమావేశం మరియు నిరసన కార్యక్రమంలో ఎర్రకుంట గ్రామ రైతులు, మహిళలు, సీపీఎం స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




