Penuballi: 45 రోజుల తర్వాత కళ్లు తెరిచారా? సీఎం సమీక్షపై సండ్ర సెటైర్లు
Penuballi: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన.
Penuballi: 45 రోజుల తర్వాత కళ్లు తెరిచారా? సీఎం సమీక్షపై సండ్ర సెటైర్లు
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి లో రైతు సమస్యలపై మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులను తీవ్రంగా నష్టపోయే పరిస్థితికి నెట్టిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని మండిపడ్డారు. మార్చి నెలలోనే వరికోతలు ప్రారంభమైనప్పటికీ, ఏప్రిల్‌లో తాము ధర్నాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం హడావిడిగా కొనుగోళ్లు ప్రారంభించిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 13 వరకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ఇప్పుడు ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారని, 45 రోజుల తర్వాత ప్రభుత్వానికి కళ్లు తెరిచాయా అని ప్రశ్నించారు. ఇంతకాలం ప్రభుత్వం నిద్రపోయిందా అంటూ మండిపడ్డారు.ప్రభుత్వం కొనుగోళ్లు సకాలంలో చేపట్టకపోవడంతో 70 శాతం వరి ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు.
మిల్లర్లు రైతులను దోచుకుంటూ బస్తాకు 12 కేజీల వరకు తాలు తీసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.రైతు భరోసా కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారని, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర పడిపోయి రైతులు క్వింటాకు 800 రూపాయల వరకు నష్టపోతున్నారని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర రాజకీయ జోక్యం జరుగుతోందని, బస్తాలు ఇవ్వాలన్నా, కాంట వేయాలన్నా పార్టీలు చూస్తున్నారని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాలను కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పెట్టారని ఆరోపించారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించామని, లబ్ధిదారులే గీటురాయిగా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్‌ను గ్రామ కాంగ్రెస్ నాయకుడు రాలేదని వెనక్కి పంపించే మూర్ఖపు పాలన సత్తుపల్లిలో నడుస్తోందని విమర్శించారు.అనంతరం ఎమ్మార్వోకు మెమోరాండం అందజేసిన సండ్ర వెంకట వీరయ్య, ఐకేపీ ఏపీఎంను కలిసి గత 50 రోజులుగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఈ దుర్మార్గపు పాలనపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలపై అందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.




