Enkoor: నకిలీ మిరప విత్తనాలతో నష్టం: ఏన్కూరులో రైతుల వినతి
Enkoor: ఏన్కూరులో నకిలీ మిరప విత్తనాలు విక్రయించి రూ.25 లక్షల నష్టం కలిగించిన దుకాణంపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారికి రైతులు వినతిపత్రం ఇచ్చారు.
Enkoor: నకిలీ మిరప విత్తనాలతో నష్టం: ఏన్కూరులో రైతుల వినతి
ఏన్కూరు: నకిలీ మిరప విత్తనాలు విక్రయించడంతో తీవ్రంగా నష్టపోయామని ఆరోపిస్తూ సుజాతనగర్ మండలం మాలబంజర గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు, రైతు సంఘం నాయకులు ఖమ్మం జిల్లా.. ఏన్కూరు మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
రైతుల వివరాల ప్రకారం.. ఏన్కూరు మెయిన్‌రోడ్డులోని జై జవాన్ జై కిసాన్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో ఏపీ-243 రకం మిరప విత్తనాలని చెప్పి ‘బంజారా పల్స్’ పేరుతో ప్యాకెట్లలో విత్తనాలు విక్రయించారని ఆరోపించారు. మాలబంజర గ్రామపంచాయతీ పరిధికి చెందిన సుమారు 20 నుంచి 25 మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసినట్లు తెలిపారు.
అయితే పంటలో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడంతో పాటు పూత, కాయ రాకపోవడం, మిరప మొక్కలకు తీవ్రంగా ముడత సమస్య ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు. దీంతో ఒక్కో ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మొత్తం రైతులకు సుమారు రూ.25 లక్షల మేర నష్టం జరిగిందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.
నకిలీ విత్తనాల విక్రయంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, విత్తనాలను పరీక్షించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. సంబంధిత దుకాణం లైసెన్స్‌ను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ రైతు సంఘం కార్యదర్శి బచ్చలకూర శ్రీనివాసరావు, రైతులు నల్లగోపు పుల్లయ్య, రాందాసు, లచ్చిరాం, భీమ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.




