Kothagudem: రబీ ప్రణాళిక, విద్య, భూసేకరణపై ప్రత్యేక దృష్టి: సీఎస్

Kothagudem: రబీ సీజన్ ప్రణాళిక, పాఠశాలలు, డిగ్రీ కళాశాలల హాజరు, జాతీయ రహదారుల భూసేకరణపై సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అంకిత్‌తో సమీక్షించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 13 Nov 2026 10:31 PM IST
Kothagudem
X

Kothagudem: రబీ ప్రణాళిక, విద్య, భూసేకరణపై ప్రత్యేక దృష్టి: సీఎస్

Kothagudem: రాబోయే రబీ సీజన్ ప్రణాళిక, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, భూసేకరణ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత లక్ష్యాల మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు సూక్ష్మ సేద్యం, ఉద్యానవన శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

రైతు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని, కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాయితీ విత్తనాల పంపిణీ, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్య పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థుల సగటు హాజరు 73.74 శాతం ఉండగా, జిల్లా స్థాయిలో 72.21 శాతంగా నమోదైందని, ఉపాధ్యాయుల హాజరు రాష్ట్రస్థాయిలో 87.06 శాతం, జిల్లా స్థాయిలో 88.05 శాతంగా ఉందని వివరించారు. ఉపాధ్యాయుల హాజరుకు అనుగుణంగా విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగాన్ని పెంచాలని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, సమగ్ర శిక్షా పథకం కింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల లక్ష్యాలను సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 96 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 11,520 సీట్లకు గాను 7,107 ప్రవేశాలు నమోదై సుమారు 61.69 శాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన సీట్ల భర్తీపై దృష్టి సారించడంతో పాటు డిగ్రీ కళాశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్. విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, జిల్లా స్థాయి కమిటీల ద్వారా కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సూచించారు.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనుల పురోగతిని సమీక్షించారు. భూసేకరణలో అవార్డుల జారీ, పరిహారం పంపిణీ, భూముల స్వాధీనం మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించాలని సూచించారు. అవార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అర్హులైన భూయజమానులకు పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ ప్రక్రియను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రబీ సాగుకు సంబంధించి తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రాయితీ విత్తనాల పంపిణీ, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలను సంబంధిత అధికారుల సమన్వయంతో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంపొందించేందుకు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సి.పి.ఓ. జె. సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM