Khammam: శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం: పువ్వాడ అజయ్!

Khammam: ఖమ్మం శ్రీనివాస్ నగర్ ఇళ్ల నిర్వాసితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా. కాంగ్రెస్ కూల్చివేతల సర్కార్ అంటూ మంత్రి తుమ్మలపై తీవ్ర ధ్వజం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2026 10:26 PM IST
Khammam
X

Khammam: శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం: పువ్వాడ అజయ్!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో గత రెండు రోజులుగా తమ ఇళ్ల కోసం పోరాటం చేస్తున్న నిర్వాసితులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా అండగా నిలిచి పోరాటం చేస్తామని తెలిపారు.

ఇళ్ల కోసం పోరాడుతున్న నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని పువ్వాడ ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం, అభివృద్ధి చేపట్టడం చేతకాని ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

పేదల ఇళ్లను కూల్చివేసి వారి జీవనోపాధిపై ప్రభావం చూపడం సరికాదని, పేదల పొట్ట కొట్టే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల కూల్చివేత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు.

తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో అనేక మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, పేదలకు గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమైతే, ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మిగిలిన ఘనతగా మారిందని ఆయన విమర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్