Khammam: గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలి: సండ్ర వెంకట వీరయ్య!

Khammam: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం వేంసూరు మండలం మర్లపాడులో జరిగింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 7 Oct 2026 4:36 PM IST
Khammam
X

Khammam: గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలి: సండ్ర వెంకట వీరయ్య!

ఖమ్మం: రానున్న ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే క్రమంలో వేంసూరు మండలం మర్లపాడులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వేంసూరు మండలానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని పార్టీ శ్రేణులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను గుర్తించి వారి ఓటు నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వైద్యులు, ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి వారిని నేరుగా కలిసి ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించాలని అన్నారు. గ్రామాలు, మండలంలోని ప్రతి ప్రాంతంలో అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి, ఎవరి ఓటు నమోదు కాలేదో గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నివసిస్తున్న పలువురు గ్రాడ్యుయేట్లు స్వగ్రామాలకు వచ్చే అవకాశం ఉందని, ఈ సమయంలో వారిని సంప్రదించి ఓటు నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సండ్ర వెంకట వీరయ్య సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సండ్ర వెంకట వీరయ్య విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీలు, యూత్ డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.

వేంసూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఘన విజయం సాధించడం సాధ్యమవుతుందని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్లను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI