Khammam: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: సండ్ర వెంకటవీరయ్య!
Khammam: కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి పోరుబాట చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
Khammam: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: సండ్ర వెంకటవీరయ్య!
ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ, నియోజకవర్గంలోని సుమారు 60 వేల కుటుంబాలకు బీఆర్ఎస్ బాకీ కార్డులను అందించాలని సూచించారు.
100 రోజుల్లో 13 డిక్లరేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని సండ్ర విమర్శించారు. రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బోనస్, యూరియా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్, విద్యా భరోసా, ఆటో డ్రైవర్లకు రూ.12 వేల వంటి హామీల పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు.
యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వివిధ యాప్‌లు, నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సండ్ర మండిపడ్డారు. ధరణి స్థానంలో భూ భారతి తీసుకొస్తామని చెప్పి.. రైతుల భూ సమస్యలను మరింత సంక్లిష్టం చేశారని ఆయన ఘాటుగా విమర్శించారు. భూ సమస్యల పరిష్కారం పేరుతో రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశామని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడినే ప్రాతిపదికగా తీసుకుని పథకాలు అందించామని సండ్ర అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల రాజకీయ నేపథ్యాన్ని చూసి సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
“1000 రోజుల సమయం ఇచ్చాం.. ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రతి కుటుంబానికి వివరించాలి. బీఆర్ఎస్ బాకీ కార్డులను ప్రజలకు అందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయాలి” అని సండ్ర వెంకట వీరయ్య గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన సూచించారు.




