Kothagudem: అఖిల్ హత్య కేసు ఛేదన.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Kothagudem: లక్ష్మీదేవిపల్లి ఎదురుగడ్డలో జరిగిన మేడి అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలే కారణమని తెలిపారు.
Kothagudem: అఖిల్ హత్య కేసు ఛేదన.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామంలో సంచలనం సృష్టించిన మేడి అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించినట్లు తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణ ప్రకారం.. గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకొని హత్యకు పథకం రచించినట్లు వెల్లడైంది. మద్యం తాగిస్తామని నమ్మించి అఖిల్‌ను ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా, సాత్విక్ కూడా ఇటుకతో దాడి చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ దాడిలో అఖిల్ మృతి చెందినట్లు తెలిపారు.
హత్యకు సంబంధించిన ముందస్తు పథకంలో మిగిలిన నిందితులు కూడా సహకరించినట్లు, మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, ఫోన్‌పే లావాదేవీల స్క్రీన్షాట్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
పాత గొడవలు, వ్యక్తిగత కక్షలతో హింసకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. వివాదాలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ కేసులో నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. కేసు ఛేదనలో టెక్నికల్ టీమ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




