Kothagudem: కొత్తగూడెంలో పోలీస్ ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్!
Kothagudem: కొత్తగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో SI, కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు.
Kothagudem: కొత్తగూడెంలో పోలీస్ ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్!
Kothagudem: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఉచిత శిక్షణ కోసం 1216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1030 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.
జిల్లాలోని ఐదు సబ్-డివిజన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం సబ్-డివిజన్‌లో సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పాల్వంచ సబ్-డివిజన్‌లో అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్, ఇల్లందు సబ్-డివిజన్‌లో గవర్నమెంట్ హై స్కూల్ (జె.బి.ఎస్.), మణుగూరు సబ్-డివిజన్‌లో శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్, భద్రాచలం సబ్-డివిజన్‌లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులకు కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచే విధంగా సమగ్ర శిక్షణ, అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని పేర్కొన్నారు.
పోలీస్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పాటు క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణలో చురుకుగా పాల్గొని, నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో సబ్-డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.




