Kothagudem: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సీఐటీయూ!

Kothagudem: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా చేపట్టింది. డిసెంబర్ 15 నుంచి సమ్మె హెచ్చరిక.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Nov 2026 2:23 PM IST
Kothagudem
X

Kothagudem: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సీఐటీయూ!

కొత్తగూడెం: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రూ.50 లక్షల ప్రమాద బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పారితోషికంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా చెల్లించాలని, ఆదివారాలు, పండుగ సెలవులతో పాటు 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన ఆరు నెలల మెడికల్ సెలవులు కల్పించాలని కోరారు.

ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు నిర్ణయించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర కమిటీ సమ్మె నోటీసులు అందజేసిందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్, అధ్యక్షులు కే. బ్రహ్మచారి, కోశాధికారి జి. పద్మ, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూనెం ఝాన్సీ, దుబ్బా ధనలక్ష్మి నాయకత్వం వహించారు. సీఐటీయూ జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్, కే. సత్య, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా నాయకులు సుశీల, జయ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM