Kothagudem: PVK-5 కార్మికులకు గుడ్ న్యూస్: 145 సర్ఫేస్ పోస్టుల కేటాయింపు
Kothagudem: కొత్తగూడెం ఏరియా PVK-5 కార్మికులకు 145 సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులను సింగరేణి కేటాయించింది. నవంబర్ 17న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Kothagudem: PVK-5 కార్మికులకు గుడ్ న్యూస్: 145 సర్ఫేస్ పోస్టుల కేటాయింపు
కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా PVK-5 అండర్‌గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ కార్మికులకు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల కేటాయింపు విషయంలో సానుకూల పరిణామం చోటుచేసుకుంది. కార్మికుల సమస్య పరిష్కారం కోసం ఐఎన్‌టీయూసీ (INTUC) ఆధ్వర్యంలో సాగిన నిరంతర పోరాటం ఫలితంగా కొత్తగూడెం ఏరియాకు సుమారు 145 సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించినట్లు ఐఎన్‌టీయూసీ నాయకులు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పోస్టుల కేటాయింపునకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల కేటాయింపు విషయంలో గత కొంతకాలంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐఎన్‌టీయూసీ నాయకులు యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి వ్యాప్తంగా సర్క్యులర్ కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి, రీజనలైజేషన్ ప్రక్రియలోనూ కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పలుమార్లు కలిసి కార్మికుల సమస్యలను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి సింగరేణి డైరెక్టర్, సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి సహకరించారని తెలిపారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్ కృషితో పాటు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ నాయకత్వంలో చేపట్టిన పోరాటాలు కూడా ఈ నిర్ణయానికి దోహదపడ్డాయని వెల్లడించారు.
సుమారు 145 పోస్టుల కేటాయింపునకు యాజమాన్యం అంగీకరించడం కార్మికులకు ఊరటనిచ్చే పరిణామమని ఐఎన్‌టీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 17న జరగనున్న కౌన్సెలింగ్‌లో అర్హులైన కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్మికుల సమస్య పరిష్కారానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, సింగరేణి యాజమాన్యానికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.




