Khammam: ఖమ్మంలో భారీ వర్షాలు.. కలెక్టర్ అప్రమత్తత ప్రకటన
Khammam: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 28న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ దివాకర టిఎస్ హెచ్చరించారు.
Khammam: ఖమ్మంలో భారీ వర్షాలు.. కలెక్టర్ అప్రమత్తత ప్రకటన
ఖమ్మం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత వాతావరణ శాఖ అక్టోబర్ 25న జారీ చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం ఈ నెల 27న జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
అక్టోబర్ 28న జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.
అక్టోబర్ 29న కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో రైతులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందరాదని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను ప్రజలు, రైతులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.




