Laxmidevipalli: లక్ష్మీదేవిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

Laxmidevipalli: లక్ష్మీదేవిపల్లిలో రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం సర్పంచ్ తాటి అనిత, ఉప సర్పంచ్ పాంచనపరపు మహేష్ ప్రారంభించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Nov 2026 3:40 PM IST
Laxmidevipalli
X

Laxmidevipalli: లక్ష్మీదేవిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

లక్ష్మీదేవిపల్లి: మండల కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని గ్రామ సర్పంచ్ తాటి అనిత, ఉప సర్పంచ్ పాంచనపరపు మహేష్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూణెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కుల, మత, వర్గ, లింగ వివక్షకు తావులేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, బోనస్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అందిస్తోందని వివరించారు.

ముఖ్యంగా కుటుంబ పోషకులుగా ఉన్న 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, ఇబ్బందుల నుంచి గట్టెక్కించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారని పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పథకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం సమీపంలోని ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీవో ఏ. సాంబయ్య, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM