Mulakalapally: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం - ఆందోళనలో కుటుంబం

Mulakalapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనూష (16) జగన్నాధపురం వద్ద బస్సు దిగిన తర్వాత అదృశ్యమైంది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 Nov 2026 10:34 PM IST
Mulakalapally
X

Mulakalapally: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం - ఆందోళనలో కుటుంబం

ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సకాలంలో ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన గీగ జ్యోతి - వసంతరావు దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు అజయ్ (18) కాగా, కుమార్తె అనూష (16) ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.

గత సోమవారం (నవంబర్ 10న) ఉదయం సుమారు 08:00 గంటలకు అనూష ఎప్పటిలాగే తన స్నేహితులతో కలిసి ఆర్టీసీ బస్సులో కళాశాలకు బయలుదేరి వెళ్ళింది. సాయంత్రం కళాశాల సమయం ముగిసిన తర్వాత స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన ఆమె, మార్గమధ్యలోని జగన్నాధపురం గ్రామం వద్ద బస్సు దిగినట్లు తోటి విద్యార్థినులు, స్నేహితులు ధృవీకరించారు. అయితే, రాత్రి అయినప్పటికీ అనూష ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

తక్షణమే అప్రమత్తమైన తల్లిదండ్రులు మరియు బంధువులు జగన్నాధపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద రాత్రంతా గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఎటూ పాలుపోని స్థితిలో తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు దిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. విద్యార్థిని ఆచూకీకి సంబంధించి ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN