Aswaraopeta: యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా జూపల్లి వెంకట్ రామారావు!

Aswaraopeta: అశ్వారావుపేట అచ్యుతాపురం వాసి జూపల్లి కోదండ వెంకట్ రామారావు యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా నియమితులైనందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 18 Nov 2026 11:27 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా జూపల్లి వెంకట్ రామారావు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన జూపల్లి కోదండ వెంకట్ రామారావుకు యూత్ కాంగ్రెస్‌లో జాతీయ స్థాయి బాధ్యతలు దక్కాయి. యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ (ప్రీ నేషనల్ ఆఫీస్ బేరర్)గా ఆయన నియమితులయ్యారు. ఈ నియామకంతో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

యూత్ కాంగ్రెస్ జాతీయ ఇన్‌చార్జి మనీష్ శర్మ, జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్ నాయకత్వంలో బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరానికి జూపల్లి కోదండ వెంకట్ రామారావు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయనకు పార్టీ నాయకత్వం జాతీయ స్థాయి బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించి వర్క్ అలొకేషన్ కూడా కేటాయించారు.

ఈ సందర్భంగా తనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు కల్పించేందుకు కృషి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిలు సయ్యద్ ఖాలిద్ అహ్మద్, కేఆర్ భవ్య, రోషిణితో పాటు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డికి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రామారావు గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కోఆర్డినేటర్‌గా, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, యువతను సమన్వయం చేసుకుంటూ సాగిస్తున్న సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కడం విశేషం.

జూపల్లి కోదండ వెంకట్ రామారావు జాతీయ కోఆర్డినేటర్‌గా నియమితులైన సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ పార్టీ అభివృద్ధికి, యువత రాజకీయ చైతన్యానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA