Khammam: ఎల్-నినోపై ముందస్తు జాగ్రత్తలు అవసరం: అదనపు కలెక్టర్!

Khammam: ఖమ్మం జిల్లాలో ఎల్-నినో ప్రభావం దృష్ట్యా తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులు ఆరుతడి పంటలు వేసేలా చైతన్యం తేవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 11 Nov 2026 10:30 PM IST
Khammam
X

Khammam: ఎల్-నినోపై ముందస్తు జాగ్రత్తలు అవసరం: అదనపు కలెక్టర్!

ఖమ్మం, నవంబర్ - 11: ఎల్నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో రానున్న కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పంటల సాగు, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పాలేరు రిజర్వాయర్ లో 3 నెలలకు, వైరా రిజర్వాయర్ లో 5 నెలలకు నీటి నిల్వలు ఉన్నాయన్నారు.

​నీటి లభ్యత తగ్గనున్న దృష్ట్యా, ఉన్న నీటిని తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరి, మొక్కజొన్న వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను వేయకుండా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి కళాజాత బృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, అలాగే వాయిస్ మెసేజ్‌ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా పశు సంవర్థక అధికారి డా. పురందర్, విద్యుత్ శాఖ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఆర్డబ్ల్యూఎస్ ఇఇ వాణిశ్రీ, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.