Khammam: లేఔట్ అనుమతుల్లో నిబంధనలు పాటించాలి కలెక్టర్!
Khammam: ఖమ్మంలో లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు ಕಟ್ಟುదిట్టంగా పాటించాలని, ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్లలో అనుమతులు ఇవ్వరాదని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు.
Khammam: లేఔట్ అనుమతుల్లో నిబంధనలు పాటించాలి కలెక్టర్!
Khammam: లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, పెండింగ్‌లో ఉన్న లేఔట్ అనుమతులపై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్‌పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్, తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి లేఔట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి రిమార్క్స్, అభ్యంతరాలు, ఎన్‌ఓసీల స్థితిగతులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ లేఔట్ కమిటీ సమావేశం అనంతరం అనుమతులు మంజూరైనప్పటికీ కొంతమంది దరఖాస్తుదారులు ఆన్లైన్‌లో అనుమతులు మంజూరు కాలేదని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఇకపై లేఔట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే సంబంధిత ఆన్లైన్ మంజూరు ప్రక్రియను మూడు రోజుల్లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లేఔట్ అనుమతులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా పరిశీలన, సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిపాదిత లేఔట్ భూమి చెరువులు, నీటి వనరులు, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇరిగేషన్, ఎన్‌పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖలు తమ పరిధిలోని అంశాలను పరిశీలించి అవసరమైన ఎన్‌ఓసీలు, నివేదికలను సకాలంలో అందించాలని ఆదేశించారు.
లేఔట్ కు అప్రోచ్ రోడ్డు, అంతర్గత రోడ్లు ఉండాలని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లేఔట్‌లో కేటాయింపులు జరిగేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
లేఔట్‌లో స్ట్రీట్ లైట్స్, సీవరేజ్ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. లేఔట్ ప్రాంతం నీటి వనరులు, నీటి ప్రవాహాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలని, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు జారీ చేయరాదని స్పష్టం చేశారు.
లేఔట్ ప్రాంతంలో గతంలో ఏమైనా నీటి వనరులు, నీటి ప్రవాహ మార్గాలు ఉన్నాయా అనే అంశాన్ని సంబంధిత అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. లేఔట్ ఆమోద ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని తెలిపారు.
అనుమతులు మంజూరు చేసిన అనంతరం కూడా వాటిలో పేర్కొన్న నిబంధనలను లేఔట్ అభివృద్ధి సమయంలో పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి లేఔట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నివేదికలకు స్పష్టమైన కాలపరిమితి విధించి, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే సంయుక్త పరిశీలన అవసరమైన లేఔట్లకు సంబంధించిన జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులను అక్టోబర్ 15వ తేదీలోగా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్‌పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




