Khammam: టపాసుల దుకాణాలు లాటరీ పద్ధతిలోనే కేటాయింపు!

Khammam: దీపావళి వేళ టపాసుల విక్రయాల్లో ప్రజల భద్రతకే ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. దుకాణాలను పారదర్శకంగా లాటరీ ద్వారా కేటాయిస్తామన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 8:16 PM IST
Khammam
X

Khammam: టపాసుల దుకాణాలు లాటరీ పద్ధతిలోనే కేటాయింపు!

ఖమ్మం జిల్లా నవంబర్ ౦౩: దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయాలు, వినియోగంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. టపాసుల దుకాణాల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేపట్టాలని సూచించారు.

మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, టపాసుల విక్రయదారులతో దీపావళి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టపాసుల దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలని, ప్రతి దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ప్రతి దుకాణంలోని విద్యుత్ వైరింగ్‌ను తనిఖీ చేసి ధృవీకరించాలని స్పష్టం చేశారు.

అగ్నిమాపక వాహనాలు, ఫైర్ సేఫ్టీ పరికరాలతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని, కాలిన గాయాలకు అవసరమైన మందులు, వైద్య చికిత్సలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ప్రజల భద్రత విషయంలో వ్యాపార లాభాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో టపాసుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, మరో అనువైన బహిరంగ ప్రదేశాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలు పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని, కాలుష్యాన్ని పెంచే టపాసులకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

కాగా, ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు 224 దరఖాస్తులు అందాయని, అందుబాటులో ఉన్న దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు పోలీస్ శాఖ ఏసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, డీపీఓ వినోద్ కుమార్‌తో పాటు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, టపాసుల వ్యాపారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్