Khammam: సోషల్ మీడియాలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి: సీపీ!

Khammam: మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కఠిన చర్యలకు ఆదేశాలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Aug 2026 6:10 PM IST
Khammam
X

Khammam: సోషల్ మీడియాలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి: సీపీ!

ఖమ్మం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, విక్రయదారులు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే, వినియోగదారులకు సరఫరా మార్గాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

నేర సమీక్షాసమావేశం గురువారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ....సమాజంలో డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టి బాధితులను సాధారణ జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమని అన్నారు. పాఠశాలలు, కాలేజీలలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.

సమాజిక మాధ్యమాల అతిగా వాడకం వల్ల పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని, ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్, ఫేస్‌బుక్, గేమింగ్ యాప్‌ల ద్వారా నేరగాళ్లు మైనర్ పిల్లలతో స్నేహం చేస్తున్నారని, పిల్లలను ప్రేమ పేరుతో నమ్మించి, లోబరుచుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వ్యక్తిగత ఫోటోలు సేకరించి వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనివల్ల పోక్సో కేసు ఫిర్యాదులు సైతం పెరుగుతున్నాయని అన్నారు.పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని, వాహనదారులు వేగ పరిమితులు పాటించాలని, ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరిని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

చోరీ సొత్తు రికవరీ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయడానికి సాంకేతికతను, ప్రత్యేక బృందాలను ఉపయోగించాలని, అదేవిదంగా రాత్రి గస్తీని పెంచడం, సీసీ కెమెరాల నిఘా, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా దొంగతనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుందర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి,నరసింహరావు, మహేష్, సాంబరాజు, సత్యనారాయణ, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story