Khammam: ఖమ్మం మహిళా పీఎస్లో సీపీ సునీల్ దత్ తనిఖీ, సమీక్ష
Khammam: ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ను సీపీ సునీల్ దత్ తనిఖీ చేశారు; కుటుంబ వివాదాలు, గృహహింస ఫిర్యాదులపై బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి ఆదేశం.
Khammam: ఖమ్మం మహిళా పీఎస్లో సీపీ సునీల్ దత్ తనిఖీ, సమీక్ష
ఖమ్మం: ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి స్టేషన్ పనితీరును, కేసుల దర్యాప్తు పురోగతిని, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై సిబ్బందితో సమీక్షించారు. మహిళా పోలీస్ స్టేషన్కు సున్నితమైన కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో, బాధ్యతాయుతంగా పరిశీలించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
కుటుంబ సమస్యల విషయంలో ఇరు పక్షాల వాదనలు ఓపికగా విని, చట్టపరిధిలో సాధ్యమైన మేరకు కౌన్సెలింగ్ ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో మహిళలపై వేధింపులు, గృహహింస, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, బాధిత మహిళలకు భరోసా కల్పిస్తూ చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్టేషన్కు న్యాయం కోసం వచ్చే మహిళలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సిబ్బంది పనిచేయాలని పోలీస్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు.




