Khammam: గణేష్ మండపాలకు డీజేలు బంద్.. ఖమ్మం సీపీ సునీల్ దత్ రూల్స్!

Khammam: ఖమ్మంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమీక్ష నిర్వహించారు. డీజేలపై నిషేధం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 10 Sept 2026 9:34 PM IST
Khammam
X

Khammam: గణేష్ మండపాలకు డీజేలు బంద్.. ఖమ్మం సీపీ సునీల్ దత్ రూల్స్!

Khammam: రానున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ మండపాల నిర్వాహకులతో నగరంలోని సూర్య తేజ ఫంక్షన్ హాల్ లో పోలీసు అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించి, ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన భద్రతా నిబంధనలు, పోలీసు శాఖ సూచనలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ఖమ్మం మున్నేరు నదిలో ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా అనువైన ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ లోని కొత్తూరు చెరువులో కొనసాగుతున్న నేపథ్యంలో మట్టి

విగ్రహాల ప్రతిష్ఠాపనకు సహకరించాలి అన్నారు. అదేవిదంగా

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ పోర్టల్ policeportal.tspolice.gov.in లో రిజిస్టర్ అయి మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనం తదితర కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికతో నిర్వహించే అవకాశం ఉంటుందని అన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ కనెక్షన్లు మరియు వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలని సూచించారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని, మండపాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని స్పష్టం చేశారు.

మండపాల వద్ద భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని నిర్వాహకులకు సూచించారు. రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు నిర్వహించకుండా నిబంధనలను పాటించాలని తెలిపారు.

గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నిర్ణయించిన మార్గాలు, సమయాలను పాటించాలని, ఊరేగింపులో పాల్గొనే వారు క్రమశిక్షణ పాటించేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలు, నీట మునిగే ప్రమాదాలు తదితర ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో మండపాల నిర్వాహకుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి, సమస్య లేదా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ గణేష్ నవరాత్రుల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.

గణేష్ మండపాల నిర్వాహకులకు సూచనలు

1) గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిర్వాహకుల పేర్లు మరియు సంప్రదింపు నంబర్లు పొందుపర్చాలి.

2) విగ్రహం ఏర్పాటు స్థలం ప్రైవేట్ వ్యక్తికి చెందినదైతే, సంబంధిత వ్యక్తుల నుండి ఎటువంటి అభ్యంతర లేదని ధృవీకరణ పత్రం పొందాలి.

3) నిర్వాహకులు "విగ్రహాలను రహదారిలో కాని వివాదాస్పద స్థలాల్లో ప్రతిష్టించవద్దని విజ్ఞప్తి.

4) ప్రధాన రహదారులపై మరియు ట్రాఫిక్ రద్దీగా వుండే రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేయరాదు.

5) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నివారించేందుకు.నాణ్యమైన విద్యుత్ తీగలు మరియు పరికరాలు గణేష్ పండల వద్దఉపయోగించాలి.

6) మండపాల వద్ద DJ లకు అనుమతి ఇవ్వబడదు,రెండు మైక్ తో కూడిన స్పీకర్లు(ధ్వని పరిమాణం తప్పనిసరిగా నాన్ డిస్ట్రబెన్స్ లెవెల్‌లో ఉండాలి) మాత్రమే అనుమతించబడతాయి.అదేవిధంగా ఉదయం 6.00 నుండి రాత్రి 10.00 వరకు సమయాలను అనుసరించి మైక్ సౌండ్ సిస్టమ్ వినియోగించాలి.

7) గణేష్ మండపాల వద్ద అసభ్యకరమైన నృత్యాలు, కార్యక్రమాలు చేపట్టకూడదు.

8) ప్రతి గణేష్ మండపంలో ఇద్దరు సభ్యులు 24 గంటలు ఉండేలా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

9) ప్రతి గణేష్ మండపం వద్ద నోటీసు బోర్డును, పాయింట్ బుక్ ఏర్పాటు చేసి తప్పనిసరిగా నిర్వాహకుల సంప్రదింపు నంబర్లు మరియు వివరాలను పొందుపర్చాలి.

10) అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి మండపం దగ్గర తప్పనిసరిగా ఫైర్ ప్రూఫ్‌గా ఉండేలా చూసుకోండి. తగినంత నీరు ఇసుక అందుబాటులో వుండాలి.

కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఎస్బి ఏసీపీ మహేష్, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, సత్యనారాయణ విద్యుత్ శాఖ డిఇ రామారావు, ఫైర్ అధికారి రామిరెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ వినోద్ లౌహిటి, విద్యాసాగర్ పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story