Khammam: కేంద్ర, రాష్ట్రాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం: సీపీఎం!
Khammam: ఖమ్మంలో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా ప్లీనరీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. సామినేని రామారావు హత్యపై సిట్ విచారణకు డిమాండ్ చేశారు.
Khammam: కేంద్ర, రాష్ట్రాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం: సీపీఎం!
ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు దేశాన్ని అభివృద్ధి పరంగా తీవ్ర అధోగతి పాలు చేస్తున్నాయని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఆదివారం ఖమ్మం మంచికంటి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య, ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
అంతర్జాతీయంగా కార్పొరేట్ వ్యవస్థకు నాయకుడిగా ఉన్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి, భారతదేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతోందని దుయ్యబట్టారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోస్తూ, వారి ఏకఛత్రాధిపత్యాన్ని ప్రోత్సహిస్తూ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల నడ్డి విరిచే చర్యలను సమర్థిస్తోందన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై దౌర్జన్యంగా అణచివేతకు పాల్పడుతోందని, ఎస్.ఎఫ్.ఐ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా ప్రశ్నించిందని గుర్తుచేశారు.
ఓట్ల నమోదు ప్రక్రియ (సర్)ను దేశంలోని ఓటర్ల తొలగింపునకు కుట్రగా వాడారని, ఈ క్రమంలో దేశంలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లను, తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల వరకు ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సిపిఐ(ఎం) ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, ఓటర్ల తొలగింపుపై మొదటగా సిపిఐ(ఎం) పార్టీయే అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను సమాయత్తం చేసి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించిందని గుర్తుచేశారు.
అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఆందోళనలు చేయడంలో పార్టీ సఫలీకృతమైందన్నారు. రాబోవు పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతిస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉద్ఘాటించారు. త్వరలో నల్గొండలో జరగనున్న రైతు మహాసభలకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి, సభను ఘన విజయం చేయాలని పిలుపునిచ్చారు.
హత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం
సిపిఐ(ఎం) పార్టీ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యా ఉదంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అనుసరిస్తున్న హత్యా రాజకీయాలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని పోతినేని సుదర్శన్ రావు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, ఇటువంటి హత్యా రాజకీయాలను నిలదీస్తూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
కరవు నివారణ చర్యలు చేపట్టాలి : నున్నా
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎల్ నీ నో పరిస్థితుల కారణంగా కరువు పరిస్థితులు తీవ్రంగా వున్నాయని పేర్కొన్నారు. కరువు మండలాల్లోని రైతాంగాన్ని. వ్యవసాయ కూలీలను, ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల కి నష్టపరిహారం చెల్లించాలని. కరవు పేరుతో బియ్యం, నిత్యవసర వస్తువుల ధరలు తీవ్రంగా పెంచుతూ,బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని చెప్పారు.
అధిక ధరల తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఈ కరువు పరిస్థితిలో ధరల నియంత్రణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు.అన్ని రకాల వస్తువుల ధరలు ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 15వ తేదీన నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అఖిలభారత కిసాన్ మహాసభ ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా లక్ష మందితో జరుగు బహిరంగ సభలో ఖమ్మం జిల్లా నుండి పదివేల మంది పాల్గొంటున్నారని చెప్పారు.
రైతు సభను జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సామినేని రామారావు హత్యపై సరైన దర్యాప్తు చేయకుండా, అసలైన దోషులను శిక్షించకుండా జిల్లా పోలీస్ కమిషనర్,కొంతమంది పోలీస్ యంత్రాంగం కట్టుకథ అల్లి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ హత్యను ఆర్థిక హత్యలుగా సృష్టిస్తున్నారని,ఇది పోలీస్ యంత్రాంగానికి సరైన పద్దతి కాదన్నారు.
ఇలా చేస్తే ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల నమ్మకం కోల్పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేసినట్టుగా సరైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సిట్ ను వెంటనే రంగంలోకి దింపి, హత్య పాల్పడిన అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఈ హత్య ప్లాన్ వెనుక కాంగ్రెస్ ఆది నాయకత్వం పక్కాగా ఉందని ఆరోపించారు. హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని, రామారావు భార్య పెట్టిన కేసు నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ అధికారులను, రాష్ట్ర ముఖ్యమంత్రిని నున్నా నాగేశ్వరరావు కోరారు.
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి. బుగ్గ వీటి సరళ బండి పద్మ. బండి రమేష్, వై విక్రం మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు. భూక్య వీరభద్రం బొంతు రాంబాబు, మడుపల్లి గోపాల్ రావు, మెరుగు సత్యనారాయణ,. సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులు పిట్టల రవి, పార్టీ సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్రావు. ఎం సుబ్బారావు. చింతల చెరువు కోటేశ్వరరావు.. పిడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




