Khammam: గోదావరి రివర్ మారథాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
Khammam: భద్రాచలంలో డిసెంబర్ 6న నిర్వహించనున్న గోదావరి రివర్ మారథాన్ పోస్టర్‌ను ఖమ్మంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.
Khammam: గోదావరి రివర్ మారథాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం: ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు గోదావరి పుష్కరాల ప్రచారం కోసం రన్నింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో భద్రాచలంలో డిసెంబర్ 6న నిర్వహించనున్న "గోదావరి రివర్ మారథాన్" పోటీల పోస్టర్‌ను ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భద్రాచలం ఆధ్యాత్మిక, పర్యాటక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
భద్రాచలం అంటేనే భక్తి, ఆధ్యాత్మికత, గోదావరి నదితో ముడిపడిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని భద్రాచలాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
డిసెంబర్ 6న నిర్వహించనున్న 5, 10, 21, 41 కిలోమీటర్ల మారథాన్ కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, గోదావరి నది పవిత్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, భద్రాచలం ప్రత్యేకతను ప్రజలకు చాటిచెప్పే గొప్ప ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. యువత పెద్ద సంఖ్యలో ఈ మారథాన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మారథాన్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా రన్నర్స్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు పన్నాల హరీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నిఖిల్, కార్తీక్, కాంగ్రెస్ నేతలు బొర్రా రాజశేఖర్, యడవెల్లి కృష్ణ, నెల్లూరి భద్రయ్య పాల్గొన్నారు.




